కలం, స్పోర్ట్స్: ఆసియా కప్ 2026లో (Womens Asia Cup 2026) చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసి.. 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది
టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ధాటికి ఆ నిర్ణయం బెడిసికొట్టింది. పవర్‌ప్లేలోనే శఫాలీ వర్మ తొలి వికెట్ తీసి పాక్‌పై ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత భారత స్పిన్నర్లు శ్రీ చరణి, ప్రేమా రావత్ పాక్ బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేశారు. శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేమా రావత్ కూడా 3 వికెట్లతో చెలరేగింది. దీప్తి శర్మ 2 వికెట్లు, శఫాలీ వర్మ ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో పాకిస్థాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. ఇది పాకిస్థాన్ మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుగా నిలిచింది.
68 బంతులు మిగిలుండగానే..
56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. శఫాలీ వర్మ, ప్రతికా రావల్ త్వరగానే పెవిలియన్ చేరగా.. స్మృతి మంధాన కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు తీసి భారత్‌ను కాసేపు ఇబ్బంది పెట్టింది. అయితే లక్ష్యం చాలా చిన్నది కావడంతో టీమిండియా ఒత్తిడికి గురికాలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివర్లో హర్మన్‌ప్రీత్ బౌండరీ, సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. భారత్ 8.4 ఓవర్లలో 57/3 సాధించి విజయాన్ని అందుకుంది. మరో 68 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏలో మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
“పాక్ నుంచి కొన్నే మంచి బంతులు”.. హర్మన్‌ప్రీత్
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ విజయాన్ని ఎంతో ముఖ్యమైనదిగా అభివర్ణించింది. బౌలర్లు ప్రణాళికకు అనుగుణంగా బౌలింగ్ చేయడం, పిచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడం విజయానికి ప్రధాన కారణాలని చెప్పింది. పాకిస్థాన్ బౌలర్లు కొన్ని మంచి బంతులు వేసినప్పటికీ.. బ్యాటర్లు చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను ముగించడం ముఖ్యమని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే స్థాయిలో రాణించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. చరణి మెరుపులు
భారత్ విజయంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది. 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జట్టు కోసం ఇలాంటి ప్రదర్శన చేయడం గొప్ప అనుభూతిగా ఉందని చరణి తెలిపింది. తన బౌలింగ్ బలాలపై నమ్మకంతో, ఫీల్డింగ్‌కు అనుగుణంగా బంతులు వేసినట్లు చెప్పింది. త్వరలో 50 వికెట్ల మైలురాయిని చేరుకోవడంపై కంటే.. దేశం కోసం మరింతగా రాణించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.
బ్యాటింగ్ వైఫల్యమే కారణం.. ఫాతిమా సనా
పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తమ బ్యాటింగ్ వైఫల్యాన్ని అంగీకరించింది. తాజా పిచ్‌పై మంచి స్కోరు చేయాలని భావించినప్పటికీ అది సాధ్యపడలేదని తెలిపింది. తమ బౌలింగ్ యూనిట్‌పై నమ్మకంతో భారత్‌ను కట్టడి చేయాలని ప్రయత్నించినట్లు చెప్పింది. తాను మూడు వికెట్లు తీసినా.. జట్టు ఓడిపోయినందున ఆ ప్రదర్శనకు పెద్దగా ప్రాధాన్యం లేదని ఫాతిమా పేర్కొంది. తదుపరి మ్యాచ్‌లో మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.
మరోసారి ‘నో హ్యాండ్‌షేక్’
భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లో మరోసారి ‘నో హ్యాండ్‌షేక్’ సీన్ కనిపించింది. టాస్ సమయంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా పరస్పరం చేతులు కలుపుకోలేదు. దీంతో గతంలో ఇరు జట్ల మధ్య చోటుచేసుకున్న ‘నో హ్యాండ్‌షేక్’ పరిణామం మరోసారి చర్చకు వచ్చింది. అయితే ఈ అంశం మ్యాచ్‌పై ప్రభావం చూపకుండా ఇరు జట్లు తమ ఆటపైనే దృష్టి సారించాయి.

