కలం, ఖమ్మం బ్యూరో: మూడు దశాబ్దాలుగా గిరిజన విద్యార్థులకు విద్యాబోధన అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మూలపోచారం (Moolapocharam) గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు డీఎస్. నాగేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. శనివారం భద్రాచలంలోని గిరిజన భవన్లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో బి. రాహుల్ చేతుల మీదుగా నాగేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
1994లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నాగేశ్వరరావు ఇర్సులాపురం, రేలకాయలపల్లి, మూలపోచారం పాఠశాలల్లో 32 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ముఖ్యంగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే తన ధ్యేయమని నాగేశ్వరరావు తెలిపారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడంపై తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

