కలం, జోగులాంబ గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ గద్వాలలో బీఆర్‌ఎస్ (Gadwal BRS) పార్టీ ‘పోరు బాట’ పేరిట భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. బోధనా రుసుములు, ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాసు హన్మంతు నాయుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా నోటిఫికేషన్ల పేరిట యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులపై కన్ను…
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ.20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించి, ఎంతో మందిని ఇంజినీర్లు, డాక్టర్లు, ఫార్మసీ, లా తదితర కోర్సుల్లో చదివించినట్లు బీఆర్ఎస్ నేతలు గుఉర్తు చేశారు. రేవంత్ రెడ్డికి మాటలే ఎక్కువ, చర్యలు తక్కువని.. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. జీవో నెం. 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చారని విమర్శించారు. పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులు లాక్కునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, బాసు శ్యామల, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, జి.రాఘవేంద్ర రెడ్డి, నాయకులు కోటేష్, చక్రధర్ రెడ్డి, గంజిపేట రాజు, భరత్ సింహ రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : రేవంత్ అధికారం కట్ చేసేందుకు సిద్ధం: నిరంజన్ రెడ్డి
Follow Us On: Instagram

