కలం, వెబ్ డెస్క్ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై కేసులు నమోదు చేయవద్దని, వారిని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని పోలీసులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) హెచ్చరించారు. కొట్టేది ఉంటే తనను కొట్టాలని, కేసులు పెడితే తనపైనే పెట్టాలని, కానీ విద్యార్థుల జోలికి మాత్రం రావొద్దని సూచించారు.
జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా సిద్ధిపేట పాత బస్స్టాండ్ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు అండగా తాను ఉంటానని, వారికేమైనా హాని తలపెట్టాలని చూస్తే అడ్డంగా నిలబడతానని హరీశ్ రావు తెలిపారు.
పోలీస్ శాఖ సంక్షేమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని హరీశ్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చేసింది ఏమీ లేదని, డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు ఏవీ అందడం లేదని ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తే ముందుగా రేవంత్ రెడ్డిపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించకుండా వారి చదువులను నాశనం చేసినందుకు, అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బాండ్ పేపర్లు పంపి నిరుద్యోగులను మోసగించినందుకు రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని హరీశ్ రావు పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కాపాడే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు.

