కలం, జనగామ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఉండకూడదని, అర్హులైన నిరుపేదలకే ఇళ్లను కేటాయించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకూలంగా ఇళ్ల కేటాయింపులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
జనగామ (Jangaon) జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు ఎర్రబెల్లి శనివారం వినతిపత్రం సమర్పించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు నిజమైన అర్హులను గుర్తించి, పారదర్శకంగా డ్రా పద్ధతిలో కేటాయింపులు చేపట్టాలని కోరారు.
‘‘కేసీఆర్ హయాంలో నేను కట్టించిన ఇళ్లు ఇవి. పేదల కోసం నిర్మించిన ఇళ్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దు. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా నిజమైన నిరుపేదలకు ఇవ్వాలి’’ అని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. నిరుపేదలకు న్యాయం చేయకపోతే వేలాది మందితో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదల ఇళ్ల విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

