కలం, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నకిరేకల్ చేరుకోనున్న సీఎం, నియోజకవర్గ పరిధిలో రూపుదిద్దుకున్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం రాజీవ్ గాంధీ స్టేడియంలో నిర్వహించే ‘ప్రజా వికాస’ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పర్యటనలో భాగంగా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” భవన నిర్మాణానికి సీఎం (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో రూ. 9.85 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TGPS) భవన నిర్మాణానికి కూడా పునాది రాయి వేయనున్నారు.
నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రజలకు అంకితం చేయనున్నారు. విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో నిర్మించే 33/11 KV సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో రూ.2.74 కోట్లతో పూర్తి చేసిన 33/11 KV సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.
మౌలిక సదుపాయాలు, పాలనా వికేంద్రీకరణను వేగవంతం చేస్తూ నకిరేకల్ మండలంలో రూ. 20 కోట్లతో నిర్మించే సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి (MDO/MRO complex), రూ.1.10 కోట్లతో నిర్మించనున్న ‘ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్’ భవనానికి శంకుస్థాపనలు నిర్వహిస్తారు. వీటితో పాటు రూ.45.60 కోట్ల భారీ వ్యయంతో నకిరేకల్–గురజాల రోడ్ నుండి బైరౌనిబండ వరకు, బైరౌనిబండ నుండి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్ వరకు అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Also Read : మినిస్టర్ క్వార్టర్స్‌లోకి కాంగ్రెస్ బాస్.. టీపీసీసీ చీఫ్ సీక్రెట్ మూవ్!
Follow Us On: X(Twitter)

