రాహుల్ గాంధీతో ఓబీసీ విద్యార్థి నేతల భేటీ

కలం, వనపర్తి: దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, కులగణనతో పాటు క్రీమీలేయర్ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) నాయకులు (OBC Students Association) కోరారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఏఐఓబీసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి. కిరణ్ కుమార్, ఓబీసీ విద్యార్థి నాయకుడు పెండెం జయంత్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం భేటీ అయ్యారు.

సుమారు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఓబీసీలకు సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో సమగ్ర, శాస్త్రీయ కులగణన చేపట్టాలని, జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని జయంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. క్రీమీలేయర్ నిబంధనల అంశంపై కూడా పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని కోరారు.

ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ, తెలంగాణకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, రాబోయే సమావేశంలో ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధి బృందం తెలిపారు. తమ సమస్యలను ఓపికగా విని స్పందించిన రాహుల్ గాంధీకి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హెచ్‌సీయూ విద్యార్థి ప్రతినిధులు దీపా కుమారి, రాకేశ్ దత్తా, పింకీ, శశికాంత్, రాకేశ్ కుమార్, రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>