కలం, నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ(Nalgonda)లోని ప్రతీక్ రెడ్డి జూనియర్ కాలేజ్ సమీపంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) నాయకత్వంలో నిర్వహించిన ‘వంటా వార్పు’ నిరసనతో రేవంత్ సర్కార్‌పై నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) మాట్లాడుతూ… ఆరు గ్యారంటీలు, వంద రోజుల పాలన పేరుతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలు అమలు చేయకుండా సీఎం, మంత్రులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి పథకం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, రైతు భరోసా హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని ఎందుకు విస్మరించారో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.
గత కేసీఆర్ (KCR) ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి పూర్తయిన ప్రాజెక్టులకే రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తున్నారని, బీఆర్ఎస్ తెచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. సెప్టెంబర్ 5న నకిరేకల్‌లో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను నిరసనలతో అట్టర్ ఫ్లాప్ చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడే సమయంలో నిరసన తెలిపి, కోడిగుడ్లతో సన్మానించాలని పిలుపునిచ్చారు.
రైతులు, పెన్షన్‌దారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభ వేదికగా ప్రభుత్వాన్ని, సీఎంను నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. నకిరేకల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై, ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కంచర్ల హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : కేటీఆర్ కామెంట్స్‌కి మంత్రి సీతక్క కౌంటర్
Follow Us On : WhatsApp

