epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

స్టేట్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా భూపేశ్ భగేల్ ?

కలం డెస్క్ : పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా (Telangana Congress Incharge) ఉన్న మీనాక్షి నటరాజన్‌ను మార్చే అవకాశాలున్నాయి. ఆ స్థానంలో చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్‌కు (Bhupesh Baghel) బాధ్యతలు అప్పగించడంపై ఏఐసీసీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇకపైన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. పార్టీ వ్యవహారాల్లో మీనాక్షి నటరాజన్ తీసుకునే నిర్ణయాలు సరైన లైన్‌లోనే ఉన్నప్పటికీ కొన్ని ఆచరణాత్మకమైన సమస్యల దృష్ట్యా మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె బాధ్యతలు తీసుకున్నా ఏడాది తిరగకముందే మార్చాలనే నిర్ణయానికి అనేక కారణాలున్నట్లు సమాచారం.

నేతలను కమాండ్ చేయలేకపోవడం.. :

ఉమ్మడి రాష్ట్రంలో గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ తదితర మోస్ట్ సీనియర్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలుగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాణిక్‌రావ్ థాకరే, మాణిక్కం ఠాగూర్, దీపాదాస్ మున్షీ తదితరులు పనిచేశారు. సిన్సియర్ కార్యకర్తగా, పార్టీకి లాయల్‌గా ఉన్నారనే గుర్తింపు మీనాక్షికి ఉన్నప్పటికీ వివిధ స్థాయిల్లోని నేతలను కమాండ్ చేయడంలో ముక్కుసూటిగా వ్యవహరించలేకపోతున్నారని, ఆమె సాఫ్ట్ నేచరే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డీసీసీల నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, అసంతృప్తులను బుజ్జగించడం, వివిధ స్థాయిల్లోని నేతల మధ్య గ్యాప్‌ను భర్తీ చేయడంలో కఠిన నిర్ణయాలను తీసుకోలేకపోవడమూ ఒక కారణమనే అభిప్రాయం నెలకొన్నది.

సింప్లిసిటీ సరే.. స్టేచర్ లేదనే భావన :

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఆమె స్టేచర్ సరిపోవడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. స్వతహాగా ముక్కుసూటి మనస్తత్వం కలిగినప్పటికీ, నిఖార్సయిన గాంధేయవాదిగా ఉన్నప్పటికీ కొద్దిమందిని నయానా భయానా కంట్రోల్ చేయడంలో ఆమె వ్యవహారశైలి సరిపోవడం లేదన్న మాటలూ గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయి. పార్టీకి లాయల్‌గా ఉండే మీనాక్షి (Meenakshi Natarajan) కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలను సైతం నిర్మొహమాటంగా మంత్రులతో, ముఖ్యమంత్రితోనే నేరుగా డిస్కస్ చేసేవారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి వ్యవహారశైలే ఆమె దీర్ఘకాలం కొనసాగలేకపోవడానికి కారణమన్నది కూడా ఒక వాదన. మీనాక్షి కంటే ముందు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలు చూసిన దీపాదాస్ మున్షీ పనితీరుతో ఇప్పుడు పోల్చుకుంటున్నారు కొందరు నేతలు. అవినీతికి పాల్పడే లక్షణాలు లేకపోవడంతో రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవసరిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో ఆమెను అప్పట్లో ఇన్‌చార్జిగా నియమించినట్లు వార్తలు వచ్చాయి.

దీటైన నాయకత్వం కోసం మార్పు :

మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ పార్టీ వ్యవహారాల (Telangana Congress Incharge) నుంచి తప్పించి చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్‌కు బాధ్యతలు అప్పజెప్పడంపై గతంలోనూ వార్తలు వచ్చాయి. ఎక్కువ సమయం ఇవ్వకుండా ఆమెను తప్పించడం సహేతుకంగా ఉండదనే భావనతో రానున్న రోజుల్లో పార్టీని స్ట్రాంగ్ చేయాలన్న టాస్క్ తో భూపేశ్ భగేల్‌కు ఇప్పుడు బాధ్యతలు ఇవ్వాలని ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జనవరిలో మార్పు ఉండొచ్చని సమాచారం. పంజాబ్ ఇన్‌చార్జిగా ఉన్నందున అక్కడి నుంచి రిలీవ్ అయిన తర్వాత తెలంగాణ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.

Read Also: రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>