కలం, వెబ్ డెస్క్: ప్రజలు కేంద్ర బిందువుగా కేసీఆర్ పని చేస్తే.. భూములే కేంద్ర బిందువుగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని కౌటాలలో శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అక్రమాలు చేసేందుకు సీఎం భూముల చుట్టూ తిరుగుతున్నాడని ఆరోపించారు. అందుకే 15 లక్షల ఎకరాల భూములు, ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో పెట్టాడని ఆరోపించారు. ఒక్క సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాల రైతుల భూములు నిషేధిత జాబితాలో రేవంత్ రెడ్డి పెట్టాడని ఫైర్ అయ్యారు.
అటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కూడా హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పేద, అమాయక ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా రేవంత్ రెడ్డి నిషేధిత జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖపై చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డి.. ప్రజలను పట్టి పీడిస్తున్న పొంగులేటి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. నీకు ఏమైనా వాటా ఉందా? అంటూ నిలదీశారు.

