కలం, ఖమ్మం బ్యూరో: పచ్చని సంసారంలో వరకట్న రాక్షసత్వం కార్చిచ్చు రేపింది. అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్న విషాద సంఘటన ఖమ్మం (Khammam) నగరంలో చోటుచేసుకుంది.
ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని సారథి నగర్‌లో వరలక్ష్మి, బానోతు బాబురావు దంపతులు ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు. భర్త బాబురావు నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి, అదనపు వరకట్నం తీసుకురావాలంటూ భార్య వరలక్ష్మిని భౌతికంగా, మానసికంగా తీవ్రంగా వేధించేవాడు. భర్త వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి, గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య (Woman Suicide) కు పాల్పడింది.
సమాచారం అందుకున్న ఖమ్మం 3 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.

