కలం, స్పోర్ట్స్: భారత క్రికెటర్, ఆల్‌రౌండర్ దీపక్ హుడా (Deepak Hooda) ఐదేళ్ల తర్వాత తన సొంత జట్టు బరోడాకు (Baroda cricket team) తిరిగి రానున్నాడు. గతంలో బరోడా జట్టు నుంచి వైదొలగడానికి కారణమైన వివాదాలకు కూడా ఇప్పుడు తెరపడింది. ముఖ్యంగా అప్పటి కెప్టెన్ క్రునాల్ పాండ్యాతో హుడాకు ఏర్పడిన విభేదాలు పరిష్కారమయ్యాయి. 2021 జనవరిలో బరోడా జట్టు హోటల్ నుంచి హుడా వెళ్లిపోయాడు. అప్పటి కెప్టెన్ క్రునాల్ పాండ్యా వ్యవహారశైలిపై హుడా తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ పరిణామాల అనంతరం బరోడా క్రికెట్ అసోసియేషన్ అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో హుడా బరోడాతో సంబంధాలు తెంచుకుని రాజస్థాన్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. అయితే ఐదేళ్ల తర్వాత పరిస్థితులు మారాయి. గత వివాదాలను పక్కనపెట్టి హుడా, క్రునాల్ పాండ్యా మాట్లాడుకున్నారని బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈఓ స్నేహల్ పారిఖ్ వెల్లడించారు. దీంతో హుడా తిరిగి బరోడా జట్టులో చేరేందుకు మార్గం సుగమమైంది.
దేశవాళీ క్రికెట్‌లో హుడా రికార్డు
31 ఏళ్ల దీపక్ హుడాకు దేశవాళీ క్రికెట్‌లో విశేష అనుభవం ఉంది. 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 4,267 పరుగులు, 14 సెంచరీలు సాధించాడు. 109 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 3,340 పరుగులు, ఆరు శతకాలు నమోదు చేశాడు. 230 టీ20 మ్యాచ్‌లలో 3,972 పరుగులు చేశాడు. భారత్ తరఫున హుడా 10 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
మరోవైపు వికెట్ కీపర్-బ్యాటర్ జితేశ్ శర్మ బరోడా తరఫున గెస్ట్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. అయితే అతడు కేవలం వైట్-బాల్ క్రికెట్‌లో మాత్రమే బరోడాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత దీపక్ హుడా మళ్లీ బరోడా జెర్సీలో కనిపించనున్నాడు. ఒకప్పుడు వివాదంతో ముగిసిన బంధం ఇప్పుడు సయోధ్యతో మళ్లీ మొదలవుతుండటం ఆసక్తికరంగా మారింది.

