కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అటవీ శాఖలో అవినీతి చేపలు వరుసగా ఏసీబీ వలకు చిక్కుతున్నాయి. పోడు రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ బీట్ అధికారి, ఆయన మధ్యవర్తి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ ఏడాదిలోనే జిల్లా ఫారెస్ట్ పరిధిలో నమోదైన నాలుగో అవినీతి కేసుగా నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం ప్రాంతంలో ఓ పోడు రైతు భూమిలో ట్రెంచ్ కొట్టకుండా ఉండటానికి బీట్ అధికారి బానోతు రవి కుమార్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఖమ్మం రేంజ్ ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలోని అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేశారు.
బీట్ అధికారి రవి కుమార్ సూచనల మేరకు మధ్యవర్తి సాదిక్ ఆ లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ బృందం చెక్ పెట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న లంచం సొమ్ముతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని డీఎస్పీ వై. రమేశ్ విజ్ఞప్తి చేశారు.

