యాదాద్రిలో కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ పోరు

కలం, యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ బుధవారం యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో భారీ నిరసన (BRS Protest) ప్రదర్శన నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక గాంధీ పార్క్‌ నుంచి బాబు జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను ప్రతిబింబించేలా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

420 హామీలతో అధికారంలోకి వచ్చారు: పైళ్ల శేఖర్‌రెడ్డి

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే 1000 రోజులు పూర్తయినా వాటి అమలులో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేసి, వాటిని తామే చేపట్టినట్లు కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. భువనగిరి సింగన్నగూడెం చౌరస్తా వద్ద కేసీఆర్‌ హయాంలో నిర్మించిన 444 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలోనూ కాంగ్రెస్‌ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

‘మళ్లీ కేసీఆర్‌ పాలనే కావాలి’

ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. పల్లెల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలను మోసం చేసిన నాయకుల తీరుపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>