​కాంగ్రెస్ తీరుపై గులాబీ సమరశంఖం.. పెద్దపల్లిలో భారీ ర్యాలీ

కలం, ​పెద్దపల్లి: అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సమరశంఖం పూరించింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన నిరసన ర్యాలీ హోరెత్తింది. ​పెద్దపల్లి (Peddapalli) వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కమాన్‌ మీదుగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా బస్టాండ్‌ కూడలి వరకు సాగింది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీల చిట్టాతో రూపొందించిన 140 మీటర్ల (420 అడుగులు) భారీ ఫ్లెక్సీతో వందలాది మంది కార్యకర్తలు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు.

ఇచ్చిన మాట ఏమైంది?: దాసరి మనోహర్‌రెడ్డి

రాబోయే రోజుల్లో ‘బాకీ కార్డుల’ పేరుతో ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బస్టాండ్‌ కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డగోలు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న రూ.15 వేల రైతు భరోసా ఏమైందని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

​స్తంభించిన రాజీవ్‌ రహదారి

ర్యాలీ అనంతరం కరీంనగర్‌–గోదావరిఖని ప్రధాన రాజీవ్‌ రహదారిపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. దీంతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించిపోగా, ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ధర్నా విరమించారు. ​ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు నూనెటి సంపత్, వంగల తిరుపతిరెడ్డి, రఘువీర్‌సింగ్, మార్కు లక్ష్మణ్, వెంకట్‌రెడ్డి, సందీప్‌రావు, ఉప్పు రాజ్‌కుమార్, జూకంటి శిరీష–అనిల్, కొయ్యడ సతీష్, శ్రీనివాస్‌లతో పాటు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>