కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ల ( Municipal Elections ) పై ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని అందరు భావించారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని వార్డుల వారిగా ఓటరు జాబితా సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 30వ తేదిన మున్సిపాలిటీల వారి వార్డుల జాబితా విడుదల అయింది. 31న పోలింగ్ స్టేషన్ వారిగా ఓటరు జాబితా, జనవరి 1న ఓటరు జాబితా ప్రచురణకు ఈసీ సన్నాహలు చేసింది. అభ్యంతరాల స్వీకరణ, మున్సిపాల్ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం, జనవరి 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించి.. జనవరి 10వ తేదీన వార్డుల వారిగా ఓటరు తుది జాబితా ప్రచురించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది.
ఓటరు జాబితా సిద్దం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన ఆశావాహులు అప్పుడే ఎన్నికల ప్లానింగ్ సిద్దం చేసుకుంటున్నారు.
అదే సమయంలో 2023 ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్ధులు వారి నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు దక్కించుకొని నియోజకవర్గంపై పట్టు సాధించడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న మున్సిపాలిటీలను కైవసం చేసుకొని నియోజకవర్గంపై పట్టు సాధించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద 2026 కొత్త ఏడాదిలో Municipal Elections జరిగే అవకాశాలు జోరుగా కానిపిస్తున్నాయి.


