కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున నిరసన (BRS Protest) కార్యక్రమం చేపట్టారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సుమారు ఐదువందల మంది కార్యకర్తలు, ప్రజలతో కలిసి తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
వారం రోజుల పాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టున నినాదాలు హోరెత్తించాయి. తెలంగాణలో అబద్ధపు హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
అన్నదాతలను ఆదుకుంటామన్న కాంగ్రెస్ సర్కార్.. రైతు భీమా పథకానికి తూట్లు పొడిచి మోసం చేసిందన్నారు. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలవాల్సిన ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక వారి భవిష్యత్తును అగమ్యగోచరంలోకి నెట్టారని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా వారికి కష్టాలను మిగిల్చారని.. ఆసరా పెన్షన్ల పెంపుదల జాడ లేదని, యువతులకు స్కూటీలు ఇస్తామన్న హామీ నీటి మీద రాతలయ్యాయని విమర్శించారు. అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైన ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరుఫున ప్రశ్నిస్తూనే ఉంటామని గంగుల స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల మోసాన్ని రాబోయే అసెంబ్లీ వేదికగా గట్టిగా ఎత్తిచూపుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడి తీవ్ర పోరాటాలు చేస్తామని సర్కార్‌ను గట్టిగా హెచ్చరించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను బాకీ కార్డు రూపంలో ముద్రించి బాటసారులకు వాహనాదారులకు, బస్సులోని ప్రయాణికులకు స్వయంగా ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ నగరశాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, బారసా కార్పొరేటర్లు
మాజీ ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

