కలం, స్పోర్ట్స్: ఆటగాళ్ల గాయాలు, వారి ఫిట్‌నెస్‌పై బీసీసీఐ (BCCI Fitness Policy) కీలక నిర్ణయం తీసుకుంది. భారీ రిస్క్‌తో సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇటీవల కొందరు ఆటగాళ్ల విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. గాయాలతో జట్టు నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడి మళ్ళీ గాయంతో జట్టు నుంచి బయటకు వెల్లడం జరిగింది.
ఇదే విషయంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా ఈ సమస్య వల్ల జట్టులో కూడా అస్థిరత పెరిగే అవకాశం ఉందని భావించిన బీసీసీఐ, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టింది. సెలెక్షన్ విషయంలో బోర్డు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆటగాడి ఫిట్‌నెస్‌పై 100 శాతం కాదు.. 200 శాతం నమ్మకం ఉంటేనే జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తాజా రిపోర్ట్ చెబుతోంది.
ఇటీవల జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు అంతర్జాతీయ సిరీస్‌లకు ఎంపికైనా.. ఆ తర్వాత ఫిట్‌నెస్ సమస్యలతో దూరమయ్యారు. దీంతో BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో నలుగురు ఆటగాళ్ల పేర్లకు ప్రత్యేక గుర్తు పెట్టారు. బుమ్రా, నితీశ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా ఎంపిక ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుంది.
అయితే బీసీసీఐ ఇప్పుడు తీసుకున్న విధానం వెనుక మరో కారణం ఉంది. అంతర్జాతీయ సిరీస్‌కు సాధారణంగా మూడు, నాలుగు వారాల ముందే జట్టును ప్రకటిస్తారు. ఆ సమయంలో ఆటగాడు ఫిట్‌గా లేకపోయినా.. సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తిగా పక్కన పెట్టకుండా, ఫిట్‌నెస్ షరతుతో జట్టులో ఎంపిక చేస్తున్నట్లు BCCI వివరించింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఫిట్‌నెస్ రిపోర్టులు, సెలెక్షన్ విషయంలో పారదర్శకత ఉండేలా చూస్తున్నట్లు గతంలో వివరించారు.
ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరనేది కూడా సెలెక్టర్లకు ముందే స్పష్టంగా ఉంటుందని తెలిపారు. అఫ్గానిస్థాన్ సిరీస్ విషయానికి వస్తే.. బుమ్రా, నితీశ్ పూర్తిగా ఫిట్ అయ్యే దిశగా ఉన్నారు. అయితే హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. వీరి విషయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావిస్తోంది.

