క్లైమాక్స్‌కు కొండా సురేఖ ఎపిసోడ్?.. నేడే కీలక నిర్ణయం!

కలం, నేషనల్ డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. ఆమె కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో, అటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అలజడికి కారణమయ్యాయి. ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏఐసీసీ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. మంత్రివర్గం నుంచి సురేఖను తప్పిద్దామా? ఆమెనే తప్పుకుంటారా? అనే కోణంలో హైకమాండ్ ఆలోచిస్తున్నది. ఏ నిర్ణయమైనా పార్టీకి మాత్రం ఎలాంటి డ్యామేజీ కాకుండా ఉండాలని ఆచితూచి అడుగులు వేస్తున్నది.

వాస్తవానికి సురేఖను తప్పించాలన్న వాదనలు పార్టీలో బలంగా వినిపిస్తున్నప్పటికీ.. అన్ని కోణాల నుంచి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని హైకమాండ్ అనుకుంటున్నది. ఆమె నిష్క్రమణ ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉండకూడదని భావిస్తున్నది. ఒకవేళ మంత్రివర్గం నుంచి తొలగించినా యథావిధిగా పార్టీ సభ్యురాలిగా కొనసాగిస్తూనే కీలకమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా హైకమాండ్ వద్ద ఉన్నట్లు తెలిసింది. విదేశీ పర్యటనను ముగించుకొని మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను సెట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖతో ఆయన సమావేశమయ్యారు.

హుటాహుటిన ఢిల్లీకి సురేఖ

సుష్మిత కామెంట్లు, మంత్రి కొండా సురేఖ తీరుపై ఇటీవల పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆరుపేజీల నివేదికను ఏఐసీసీకి పంపింది. ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినా తీరు మారలేదని, తప్పించాల్సిందేనని రిపోర్ట్ లో సిఫారసు చేసినట్లు సమాచారం. మూడురోజుల పర్యటన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఇదే క్రమంలో మంత్రి కొండా సురేఖకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆమె సైతం హుటాహుటిన హస్తినకు చేరుకున్నారు.

అన్ని కోణాల్లో చర్చలు

మరోవైపు విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన కేసీ వేణుగోపాల్.. తెలంగాణలోని పరిస్థితిపై ఫోకస్ పెట్టారు. దాదాపు పది రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన క్రమశిక్షణ ఉల్లంఘనల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని ఏఐసీసీ భావిస్తున్నది. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడమా?.. లేక స్వచ్ఛందంగా ఆమె తప్పుకునేలా చేయడమా?.. లేక కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సర్దుబాటు చేయడమా?.. అనే కోణంలో కాంగ్రెస్ హైకమాండ్ డిస్కషన్స్ చేస్తున్నది.

ఈ క్రమంలోనే కొండా సురేఖ అంశంపై ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కేసీ వేణుగోపాల్ చర్చించారు. అనంతరం సురేఖతోనూ సమావేశమయ్యారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళగా ఆమెపై చర్యలు తీసుకుంటే దాని ప్రభావం పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఎలా ఉంటుందన్న అంశంపైనా ఏఐసీసీ దృష్టిపెట్టింది. సుష్మిత చేసిన పరుష వ్యాఖ్యలకు ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖపై చర్యలు ఎలా తీసుకుంటారనే లాజికల్ కోణం నుంచి కూడా ఏఐసీసీ ఆలోచిస్తున్నది.

సుష్మిత వ్యాఖ్యలతో సురేఖకు ఎలాంటి సంబంధం లేనప్పుడు చర్యలు ఏ మేరకు సమంజసం అనే వాదనలూ ఉన్నాయి. స్వయంగా మంత్రివర్గం నుంచి ఆమె తప్పుకునేలా వ్యవహరించడమా?.. లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను తప్పించడమా?.. అనే తరహాలో ఆలోచనలు జరుగుతున్నాయి.

సీఎం రేవంత్‌రెడ్డితో కేసీ వేణుగోపాల్ (KC Venugopal) భేటీ అయిన సందర్భంగా తాజా స్టేటస్‌పై ఆరా తీశారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశమున్నదో చర్చించినట్లు తెలిసింది.
మరో రెండేండ్లలో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో పార్టీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నది. ఒకవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిని కట్టడి చేయాలంటే కఠినంగా ఉండాలన్న ఆలోచన.. మరోవైపు తీసుకునే నిర్ణయం పార్టీలో సరికొత్త వివాదం సృష్టించకూడదనే ఆలోచన.. ఇప్పుడు ఏఐసీసీకి సవాల్ గా మారింది.

నేడు మీనాక్షి, మహేశ్‌తో భేటీ

కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ పై ఢిల్లీలో ఆమెతోపాటు అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. బుధవారం ఉదయం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో సమావేశం కానున్నారు. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ నివేదికను స్టడీ చేసి ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేతో పాటు రాహుల్‌గాంధీతో చర్చించి నిర్ణయాన్ని వెలువరించే అవకాశమున్నది. క్రమశిక్షణ కమిటీ చీఫ్ ఎంపీ మల్లు రవితోనూ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యే చాన్స్ ఉంది.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులంతా ఢిల్లీలోనే ఉన్నారు. సెప్టెంబరు 3న జరిగే హైకమాండ్ భేటీ కీలకం కానున్నది. ఆ రోజున మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో ఏఐసీసీ స్పష్టమైన నిర్ణయాన్ని వెలువరించే అవకాశమున్నది. డైరెక్ట్ గా కొండా సురేఖపై వేటు వేస్తున్నారనే తీరులో కాకుండా సున్నితమైన తీరులోనే ప్రకటన వెలువడే అవకాశమున్నది.

దసరా నాటికి కేబినెట్ రీ షఫ్లింగ్!

రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను భర్తీ చేయడంతో పాటు పలువురి శాఖలను మార్చేలా, కొందరిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చేలా చర్చలు మొదలయ్యాయి. నలుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేలా రాష్ట్ర స్థాయిలో ఆలోచనలు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్ మంత్రివర్గంలో చేరేందుకు దాదాపుగా సన్నాహాలు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో గడ్డం ప్రసాద్ మంగళవారం సమావేశమవడం మరింత చర్చకు దారితీసింది. మంత్రి కొండా సురేఖ(Konda Surekha)ను తప్పిస్తారా? తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి.. నిష్క్రమిస్తున్న మరో ముగ్గురు మంత్రుల స్థానంలో ఎవరు వస్తారు.. ఇలాంటివన్నీ దసరా నాటికి కొలిక్కి రానున్నాయి.

చిన్నారెడ్డి ఇష్యూపైనా..!

మంత్రి కొండా సురేఖతోపాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు ఏఐసీసీ పరిధిలోకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీలో కీలక భూమిక పోషించి గతంలో తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన చిన్నారెడ్డికి ఉద్యమకారుడనే గుర్తింపు ఉన్నది. ఇందిరాగాంధీ కాలం నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌తోనే ఉన్న ఆయనపై చర్యలు తీసుకోడానికి ముందు ఏఐసీసీ ఆచితూచి అడుగేయాలనుకుంటున్నది.

పదవి నుంచి మాత్రం తప్పించి పార్టీలో కొనసాగేలా చూడడం ఉత్తమం అని భావిస్తున్నట్లు తెలిసింది. ఒక వివాదాన్ని పరిష్కరిస్తున్నప్పుడు అది మరో వివాదానికి, సంక్షోభానికి కారణం కావద్దన్నది ఏఐసీసీ ఆలోచన. సున్నితమైన వ్యవహారాన్ని అంతే సున్నితంగా డీల్ చేయాలని, కఠిన యాక్షన్ తీసుకుంటే జరగబోయే పరిణామాలను గమనంలోకి తీసుకుని మధ్యేమార్గంగా వ్యవహరించాలని భావిస్తున్నది. మరోవైపు పార్టీ లైన్ దాటి మాట్లాడేవారికి గట్టి మెసేజ్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నది.

Also Read : జీతాలకు సై.. బాధ్యతలకు నై!

Also Read : తుమ్మిడిహెట్టిపై తేలని పంచాయితీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>