కలం, నేషనల్ డెస్క్: తుమ్మిడిహెట్టి బ్యారేజీ (Tummidihatti Barrage) నిర్మాణంపై పంచాయితీ ఎటూ తేలలేదు. కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశం కొలిక్కి రాకుండానే ముగిసింది. గోదావరి నది మీద తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో ఢిల్లీలో మంగళవారం జల సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా మీటింగ్ జరిగింది.
బ్యారేజీ(Tummidihatti Barrage)ని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు గాను డిజైన్, ప్రపోజల్స్ ను తెలంగాణ అధికారులు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో 148 మీటర్లకంటే ఎక్కువ ఎత్తులో నిర్మించడం కుదరదని, దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని మహారాష్ట్ర అధికారులు స్పష్టం చేశారు. బ్యారేజీ ఎత్తును 152 మీటర్లకు పెంచినా మహారాష్ట్రలో ముంపు ప్రాంతం తక్కువేనని తెలంగాణ వాదిస్తున్నది. ఈ బ్యారేజీ డిజైన్, టెక్నికల్ అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర పేర్కొన్నది.
నిర్ణయం లేకుండానే..!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 11న ప్రధాని మోదీకి రాసిన లేఖలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఆవశ్యకత, వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాజెక్టుతో తాగు, సాగునీటి సౌకర్యాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ఎత్తును 152 మీటర్లతో నిర్మించనున్నందున మహారాష్ట్ర ప్రభుత్వం ముంపు పేరుతో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నదని, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సందేహాల నివృత్తి కోసం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.
దానికి తగ్గట్టు ప్రధాని కార్యాలయం ఈ లేఖపై స్పందించి జలశక్తి మంత్రిత్వశాఖకు ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి కేంద్ర జల సంఘానికి ఆదేశాలు వెళ్లడంతో మంగళవారం ఢిల్లీలో ఈ భేటీ జరిగింది. ప్రాథమిక స్థాయిలో బ్యారేజీ వివరాలను తెలంగాణ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర ఇరిగేషన్ ఆఫీసర్లు మాత్రం ఎత్తును 152 మీటర్ల అంశంలో సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఎలాంటి నిర్ణయం జరగలేదు. మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. బ్యారేజీకి సంబంధించి పూర్తి వివరాలను స్టడీ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర అధికారులు తెలిపారు.
Also Read : జీతాలకు సై.. బాధ్యతలకు నై!
Also Read : యూఎస్‌లో తెలుగు వారి కథ: షాకింగ్ వీడియో వైరల్!
Follow Us On: X(Twitter)

