కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. యాప్స్‌లో బుకింగ్ కాకపోవడంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పాత పద్ధతిలోనే దుకాణాల వద్ద నేరుగా యూరియా విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం రైతులు మెదక్-రామాయంపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ విధానంలో సైట్ ఓపెన్ చేసిన ఒక్క నిమిషంలోనే 2,000 యూరియా బస్తాల బుకింగ్ పూర్తయిపోవడంతో రైతులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. “మా దగ్గర ఉన్న చిన్న ఫోన్లలో యాప్‌లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?” అని మహిళా రైతులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాత పద్ధతిలోనే సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపుల ద్వారా టోకెన్లు ఇచ్చి ఎరువులు పంపిణీ చేయాలని తెలిపారు. డిజిటల్ విధానం వల్ల సామాన్య, నిరక్షరాస్య రైతులకు అన్యాయం జరుగుతోందని ఆందోళనకారులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సరిపడా యూరియా స్టాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

