ప్రజావాణి అర్జీలపై ఫోకస్.. అదనపు కలెక్టర్ కీలక సూచనలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ప్రజావాణిలో (Prajavani) అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సత్వరం పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Additional Collector Madhusudan Naik) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని, ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజావాణిలో వచ్చిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్య స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, ఎక్సైజ్, పౌరసరఫరాలు, భూ సర్వే–రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్లు–రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్య–ఆరోగ్యం, మైనింగ్, అటవీ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన 87 వినతులు అందాయి.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగంగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖ తనకు కేటాయించిన లక్ష్యాలను సమీక్షించుకుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. వనమహోత్సవంలో భాగంగా చేపడుతున్న మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి జియోట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు శాఖల వారీగా నాటిన మొక్కల పురోగతి వివరాలను సోమవారం సాయంత్రంలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి

ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణాభివృద్ధి, వనమహోత్సవం, భూభారతి, ప్రజావాణి తదితర కార్యక్రమాల అమలుపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి జిల్లా అధికారికి కేటాయించిన మండలాలను ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షించాలని, ఆయా మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. మండలస్థాయి అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి సమస్యలను గుర్తించి సాధ్యమైన మేరకు స్థానికంగానే పరిష్కరించాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లపై ప్రత్యేక దృష్టి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని మధుసూదన్ నాయక్ ఆదేశించారు. మండలాల వారీగా గ్రౌండింగ్ కాని ఇళ్లను గుర్తించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనాలు అందేలా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులను వేగవంతం చేయాలని, గ్రామాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని అవసరమైన పనులను గుర్తించి ప్రారంభించాలని సూచించారు.

పెండింగ్ అంశాలపై కార్యాచరణ

ప్రజావాణి, ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు కేసులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర పెండింగ్ వ్యవహారాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖలో పెండింగ్ అంశాలను గుర్తించి నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ పనితీరును ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని, అవసరమైన చోట అంతర్‌శాఖల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ఏ. నిర్మల, జెడ్పీ సీఈఓ ఇన్‌చార్జి డీపీఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>