కలం, జోగుళాంబ గద్వాల: అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరైన రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గద్వాల రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ పథకం పనులు పూర్తయితే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న రైళ్లకు అదనంగా ఇతర రైళ్ల స్టాపింగ్ కు కృషి చేస్తానన్నారు. స్టేషన్ లో ప్లాట్ఫార్మ్స్ విస్తరణ, పార్కింగ్ అభివృద్ధి, నూతన పరిపాలన భవనం, గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా ముఖద్వారా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. స్టేషన్ వెనుక వైపు నుంచి కూడా రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులకు సౌకర్యంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైల్వే హబ్ గా జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదని తెలిపారు. గద్వాల రైల్వే స్టేషన్ ప్రారంభమై వందేళ్లు దాటడంతో అమృత్ భారత్ పనులు పూర్తయ్యాక జిల్లా ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రైల్వేకు సంబంధించి గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులను ప్రయాణికులకు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వాలు ఏడాదికి రూ.886 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి రూ.5454 కోట్ల నిధులను ఒక్క తెలంగాణకే కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. గద్వాలలో రూ.66 కోట్ల నిధులతో మరో ఆర్ఓబి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 174 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించామని కిషన్ రెడ్డి తెలిపారు. కాజీపేటలో నూతన సాంకేతికతను వినియోగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రైళ్ల బోగీల తయారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారు. రైల్వే ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోందని, దేశవ్యాప్తంగా కవచ్ టెక్నాలజీనీ అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏడు బుల్లెట్ రైళ్లను ప్రకటిస్తే అందులో తెలంగాణ రాష్ట్రానికే మూడింటిని కేటాయించడం గర్వకారణంగా ఉందన్నారు. వీటిని హైదరాబాదు నుంచి పూణే, చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు నడపడంతో రాష్ట్రం గేమ్ చేంజర్ గా మారుతుందని చెప్పారు.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాలను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని, ఫలితంగా భక్తుల సంఖ్య కూడా పెరగడంతో క్షేత్ర విశిష్టత ఇనుమడిస్తుందన్నారు. విమానాశ్రయాలను తలపించేలా గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. వందేళ్లు పూర్తి చేసుకున్న గద్వాల రైల్వే స్టేషన్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గద్వాల రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు స్టాపింగ్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే అన్ని రైళ్లు ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల – డోర్నకల్, మాచర్ల – గద్వాల రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమయ్యేలా ప్రయత్నిస్తానన్నారు. డబ్లింగ్ పనులు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎంపీ పేర్కొన్నారు.
గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ… గద్వాల సంస్థానాధీశులు ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. రైల్వే స్టేషన్ కు వాడిన స్థలం కాకుండా మిగిలిన స్థలంలో భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. గద్వాల పేరు చెప్పగానే మొదట ఇక్కడి చేనేత జరీ చీరలు గుర్తొస్తాయని, రైల్వే కనెక్టివిటీ సౌకర్యాలు మెరుగుపడితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గద్వాల జిల్లా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ అంతర్ రాష్ట్ర సరిహద్దుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

