కలం, వనపర్తి: కృష్ణా నది వరద జలాలను మాత్రమే వినియోగించాల్సిన వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలను మళ్లించడాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జలచౌర్యానికి పాల్పడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మౌనం వహించడం తెలంగాణ ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. వనపర్తి (Wanaparthy) జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాల వినియోగం, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణం, జలహక్కులపై వైట్‌బోర్డుపై వివరించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి వరద జలాల వినియోగమే ప్రాతిపదికగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం నికర జలాలను కూడా వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు 90 శాతం పూర్తి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో పురోగతి లేకుండా పోయిందని విమర్శించారు.
రాష్ట్ర సొంత నిధులతో పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, టన్నెల్‌ల నిర్మాణం చేపట్టామని, నార్లాపూర్–ఏదుల లింక్ కెనాల్‌తో పాటు మిగిలిన పనులను పూర్తి చేస్తే పాలమూరుకు సాగునీటి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలుగుతుందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జూరాల వద్ద వరద జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతల పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అవసరాన్ని వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ పనులపై కూడా ఆయన స్పందిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కొంత మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడామని, పాలమూరు ప్రాంతం పచ్చబడాలనే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల కోసం కృషి చేశామని తెలిపారు. నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో ప్రొజెక్టర్ పెట్టుకొని తలాతోక లేని ఆరోపణలు చేస్తే సహించబోమని, తాట తీస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. 14ఏండ్లు కడుపు కట్టుకొని తెలంగాణ కోసం కోట్లాడామని, ఏనాడు చెయ్యి చాపి ఒక్క రూపాయి అడిగింది లేదని నిప్పులా బ్రతికామని స్పష్టం చేశారు. వందరోజుల తర్వాత లేనిపోనీ ఆరోపణలు చేస్తున్న సన్యాసులకు రాజకీయ సమాధి కడతామని నిరంజన్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో గట్టు యాదవ్, వామనగౌడ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, నందిమల్ల అశోక్, జగదీశ్వర్‌రెడ్డి, రఘుపతి రెడ్డి, కృష్ణానాయక్, కర్రీస్వామి, ఎం.వేణుగోపాల్, రాళ్ల కృష్ణయ్య, సామ్యానాయక్, దిలీప్‌రెడ్డి, రాజశేఖర్, శివరాంరెడ్డి, శ్రీకర్‌గౌడ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, నాగన్నయాదవ్, సునీల్ వాల్మీకి, గులాంఖాదర్‌ఖాన్, బొబ్బిలి ప్రేమ్‌కుమార్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, నందిమల్ల సుబ్బు, మంద రాము తదితరులు పాల్గొన్నారు.

