కలం, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) గత 1000 రోజుల పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కళ్యాణ్ చంద్ర (Kalyan Chandra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ‘ప్రజా పాలన’ పేరుతో పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తుందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు వాగ్దానాలు చేసిందని, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు పూర్తిగా నీటి మూటలయ్యాయని విమర్శించారు.
హామీలను అరకోరగా అమలు చేసి నేడు పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రస్తుతం కొత్తగా రాష్ట్రంలో 22-ఏ చట్టాన్ని తీసుకువచ్చి, భూ యజమానులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా సొంత భూమి హక్కుదారులను కూడా ఇబ్బంది పెట్టేలా వారి భూములను నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చడం ద్వారా ప్రభుత్వం రైతులను, సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. నిరుద్యోగ భృతిని గాలికి వదిలేసి, యువత డిక్లరేషన్ అటకెక్కించి, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
ప్రధానంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఇలా ఏ వర్గాన్ని చూసినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. రుణమాఫీ, భృతి వంటి హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు.
కాంగ్రెస్ పాలన పూర్తిగా స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా, అధికారమే పరమావధిగా కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి, కేవలం ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. ఇది ప్రజా పాలన కాదు, పక్కా ప్రజా వ్యతిరేక పాలన అని ఘాటుగా విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను, వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేసి, గత బీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు.

