పోక్సో కేసు.. నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

కలం, నల్లగొండ: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ (Nalgonda) జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, బాధితురాలి పునరావాసం కోసం రూ.7 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే… 2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన అన్యాయంపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ప్రతాప్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మూడవత్ మల్లేష్‌ ఈ నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో అధికారులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో అభియోగపత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ హాజరై నిందితుడి నేరాన్ని నిరూపించేలా బలమైన వాదనలు వినిపించారు.

పోలీసు యంత్రాంగం పక్కాగా సేకరించిన సాక్ష్యాధారాలను, ప్రాసిక్యూషన్ వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు మూడవత్ మల్లేష్‌ను దోషిగా ఖరారు చేస్తూ ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణను వేగవంతం చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్‌హెచ్‌ఓ ఎం.రాములు, అప్పటి సిఐ డి.వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఎస్‌హెచ్‌ఓ సిహెచ్.బాలకృష్ణ, ప్రస్తుత సీఐ కే.బీసన్న, పి.లింగయ్య, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పనలను ఉన్నతాధికారులు అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>