కలం, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కు సొంత ప్రభుత్వం షాకుల మీద షాకులిస్తోంది. కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో సురేఖ మంత్రి పదవికే గండం మొదలైంది. ఆమెపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం, ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం అందరికీ తెలిసిందే. రేపో మాపో ఆమె పదవి పోతుందని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కొండా సురేఖ ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల గూడురులో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఫొటో లేకుండానే ఫ్లెక్సీ ముద్రించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే పెట్టారు. ఇక ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు సైతం కొండా సురేఖను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా ఉద్దేశ పూర్వకంగానే జరుగుతుందన్నది స్పష్టమవుతోంది.
ఇక తాజాగా మహబూబాబాద్‌లో మంత్రి పొంగులేటి అధ్యక్షతన నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. జిల్లాలోని కేసముద్రంలో జరుగనున్న ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ, శిలాఫలకంలో మంత్రి కొండా సురేఖ ఫోటో, పేరును పెట్టలేదు. ప్రస్తుతం ఈ విషయం ఉమ్మడి వరంగల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

