కలం, కరీంనగర్: సంఘ శతాబ్ది వేళ అక్షర గురుదక్షిణగా జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో “జెండాపై కవిరాజు” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం కరీంనగర్లోని (Karimnagar) భగవత్ నగర్ భగవతి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ (మాజీ మేయర్) యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై జెండాపై కవిరాజు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. సమాజానికి మరియు దేశానికి సంబంధించిన అంశాలపై లోతైన అధ్యయనంతో, సమగ్రమైన పట్టుతో రాసిన కవిత్వాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.
పుస్తకరచన శ్రమతో కూడుకున్న విషయం..
అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో ఇటువంటి కవితా సంపుటిని రూపుదిద్దడం ఎంతో శ్రమతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. జాతీయ సాహిత్య పరిషత్ సమాజంలో సాహిత్యానికి, సాంస్కృతిక వికాసానికి చేస్తున్న కృషిని కొనియాడుతూ, రాబోయే రోజుల్లో పరిషత్ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ వంతు మద్దతు, భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ రాజు, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్, జిల్లా కార్యదర్శి నంది శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ సామల కిరణ్, ప్రముఖ కవి గండ్ర లక్ష్మణ్ రావు, భగవతి స్కూల్స్ చైర్మన్ బి.రమణ రావు, తదితరులు పాల్గొన్నారు.

