రాయదుర్గం భూములు @ గోల్డ్‌ మైన్‌!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాటికి రాయదుర్గంలోని భూములు (Raidurgam Lands) గోల్డ్‌మైన్‌లుగా మారుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టూ పెరుగుతున్న ల్యాండ్స్ విలువను ప్రభుత్వాలు ఆదాయ వనరుగా చూస్తున్నాయి. రాయదుర్గం, కోకాపేట్‌ వంటి ప్రాంతాల్లో గతంలో బీఆర్ఎస్ సర్కార్ భూముల వేలం ద్వారా వేల కోట్ల రూపాయలను సమకూర్చుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్ కూడా సేమ్ టు సేమ్. గత ప్రభుత్వంలో (2017లో) రాయదుర్గంలోని భూములు ఎకరానికి గరిష్టంగా రూ. 42.59 కోట్లకు అమ్ముడుపోతే ఇప్పుడు తొమ్మిదేండ్ల తర్వాత అదే ప్రాంతంలోని భూములు ఎకరానికి రూ. 269 కోట్ల మేర అమ్ముడుపోతున్నాయి. ప్రభుత్వ భూముల్ని అమ్మే విధానాన్ని గతంలో బీఆర్ఎస్ సర్కార్ అవలంబించగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో రాయదుర్గం భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి ఇక్కడి భూములు ఆదాయ వనరులుగా మారాయి.

విక్రయంపై విమర్శల పర్వం

– రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూముల్ని అమ్మడమే పనిగా పెట్టుకున్నదని, భవిష్యత్ అవసరాలకు చివరకు శ్మశానాలకు కూడా దొరకనంతగా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ముఖ్యమంత్రి మారారంటూ బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర స్వరంతోనే విమర్శలు చేస్తున్నారు.
– గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం రాయదుర్గం, కోకాపేట్ భూముల్ని ఎడాపెడా విక్రయించింది. నాన్-టాక్స్ పేరుతో ప్రభుత్వ భూముల్ని అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకునేలా బడ్జెట్‌లోనే అంచనాలు వేసుకున్నది. కానీ, ఆ అంచనాలకు తగినట్లుగా భూ విక్రయాలు జరగలేదు.
– బీఆర్ఎస్ హయాంలో రాయదుర్గంలో 2017లో ఒక్కో ఎకరానికి రూ. 42.59 కోట్ల చొప్పున గౌరా వెంచర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం రూ 130 కోట్లు పెట్టి 2.84 ఎకరాల భూమిని కొనుక్కున్నది. ఆ తర్వాత 2023లో కోకాపేట్‌లోని నియోపొలిస్ దగ్గర ఎకరం రూ. 100.75 కోట్ల ధర పలికింది.
– ఇప్పుడు ఎక్కువ ధర పలుకుతుండడంతో భూముల్ని అమ్మడమే పనిగా పెట్టుకున్నదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. గత ప్రభుత్వం చేసిన పనినే కాంగ్రెస్ కొనసాగిస్తున్నది.

ఆ ల్యాండ్ బంగారు బాతు గుడ్డు!

గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, బీఆర్ఎస్ లీడర్లు ఉద్దేశపూర్వకంగానే కమీషన్లకు కక్కుర్తి పడి ఆక్రమణలు జరిగేలా ప్రోత్సహించారని, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వారి భాగోతం బయటపడుతున్నదని ముఖ్యమంత్రి, మంత్రులు సహా కాంగ్రెస్ లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్ లాంటి ప్రాంతాల్లో హైడ్రా రంగంలోకి దిగి.. చెరువులను చెర నుంచి విడిపిస్తున్నది. ఒక్కో ఎకరం రూ. 269 కోట్లకు అమ్ముడుపోతున్న రాయదుర్గం ప్రాంతంలో భూముల సేల్స్ ద్వారా ప్రభుత్వం ఆదాయం ఆర్జించాలనుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో ఆక్రమణకు గురైనవాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైడ్రా ద్వారా లెక్కలు తేలుస్తున్నది. భూముల మానెటైజేషన్ ప్రభుత్వాలకు వరంగా మారింది. ఒక్క ఎకరానికే వందల కోట్ల ఆదాయం వస్తుండడంతో సంక్షేమ పథకాల అవసరాలకు ఈ భూములపై ప్రభుత్వాలు ఆధారపడుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూములు బంగారు బాతుగుడ్లుగా మారాయి. భూములను అభివృద్ధి పనులకు బదులుగా ఖజానాకు కాసులు కురిపించే వనరులుగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. బడ్జెట్‌లో పెట్టుకున్న నాన్-టాక్స్ ప్రతిపాదనలు, అంచనాలే ఇందుకు నిదర్శనం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>