నాణ్యతలో రాజీ వద్దు.. ప్రజల పర్యవేక్షణే కీలకం: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: నగరంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత అత్యంత ముఖ్యమని, ప్రజల నిరంతర పర్యవేక్షణే పనుల మన్నికకు సరైన మార్గమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. శనివారం ఖమ్మం (Khammam)  నగర పాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్‌లో రూ. 95.50 లక్షల సుడా నిధులతో నూతనంగా నిర్మించనున్న రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగిస్తూ, నిర్మించే ప్రతి పని పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా అభివృద్ధి పనులను పర్యవేక్షించినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, ప్రజల భాగస్వామ్యంతోనే నగర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

​విశాలమైన రహదారులు, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనతో ఖమ్మం అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి అన్నారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణం వల్ల ఆరోగ్యం మెరుగుపడి కుటుంబాలపై పడే వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని సూచించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>