కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిన డంప్‌యార్డ్‌ను వెంటనే నగరానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయం ముందు తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. “డంప్ యార్డ్‌లో చెత్త గుట్టలు తగ్గడం లేదు గానీ, కొందరు అధికారుల, ప్రజా ప్రతినిధుల ఇళ్లలో నోట్ల కట్టల గుట్టలు పెరుగుతున్నాయి” అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై పాలకులకు కనీస పట్టింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ (Karimnagar) నగరం నుండి రోజూ దాదాపు 150 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్‌కు చేరుతోందని, ఇప్పటికే అక్కడ 4.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. దీనివల్ల నగరంలో సగం భాగం ప్రజలు దుర్వాసన, పొగ, దోమలు, తీవ్ర కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సమస్య తీరుస్తామని చెప్పిన కేంద్ర మంత్రి, మంత్రులు, పాలకవర్గం ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు. బయో మైనింగ్ పేరుతో ఇప్పటికే రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, చెత్తను శాస్త్రీయంగా తొలగించే ప్రక్రియ ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ డంప్‌యార్డ్‌ను తక్షణమే నగరానికి దూరంగా తరలించేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని గుంజపడుగు డిమాండ్ చేశారు. పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ప్రజలకు ఆరోగ్య, పర్యావరణ సమస్యల నుండి శాశ్వత విముక్తి కల్పించాలన్నారు. తడి, పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరు చేసి ప్రాసెసింగ్ చేసే పటిష్టమైన వ్యర్థాల నిర్వహణ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఈ సమస్యపై పోరాటాన్ని మరిన్ని రూపాల్లో తీవ్రతరం చేస్తామని హరిప్రసాద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి చెన్నమల్ల చైతన్య, బీసీ విభాగం అధ్యక్షులు శ్రీరాముల రమేష్, ఆదివాసి విభాగం అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బాసవేణి రాజేందర్, ధీటి రమేష్, మడిపల్లి వినీత్, లింగంపల్లి శ్రీనివాస్, కొత్తూరు రఘు, ఎండి హుస్సేన్, నూతి సాయి చరణ్, ఎండి రజి, బి రాజు, విద్యాసాగర్, సూత్రాల రాజన్నా, అభిరామ్, పిన్నింటి సంగీతారెడ్డి, ఎండి సల్మా, పొన్నం శిరీష, జంగా అపర్ణ, కొలిపాక గౌతమి, కుతాడి రజిత, కుసుంబ మంజులా రెడ్డి, కొరిమి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!
Follow Us On: X(Twitter)

