కలం, వెబ్‌డెస్క్: ఆటపాటలు, చదువులకు నిలయం కావాల్సిన బడి ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. అమ్మలా ఓర్పుతో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ రాక్షసిగా మారి చిత్రహింసలు పెట్టింది. ఆదిబాలాబాద్ జిల్లా బోథ్ (Boath) మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరుమాని రిత్విక్ అనే బాబు పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. బాబుపై ఓ లేడీ టీచర్ ఇటీవల అమానుషంగా ప్రవర్తించింది. తరగతి గదిలోనే చిన్నారిని దారుణంగా చితకబాదింది. బాలుడు సరిగ్గా చదవడం లేదో, లేదా అల్లరి చేశాడో తెలియదు. కానీ, ఆ టీచర్ క్రూరత్వం మాత్రం హద్దులు దాటింది. చిన్నారి చెవి మెలితిప్పడంతో పాటు కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. అంతేకాకుండా చిన్నారి చెంపలపై, వీపుపై పిడిగుద్దులు కురిపించింది. ఆ పసివాడు భయంతో వణికిపోతున్నా కనికరం చూపకుండా పదే పదే అలాగే ప్రవర్తించింది.
ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడు బడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటిపై గాయాల గుర్తులు, వాపులు ఉండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఆందోళనకు గురైన వారు చిన్నారిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఆ పసి వాడు బోరున విలపిస్తూ టీచర్ చేసిన చిత్రహింసలను తల్లిదండ్రులకు వివరించాడు. వెంటనే అప్రమత్తమైన వారు పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు.
క్లాస్ రూంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా దారుణ దృశ్యాలు కంటపడ్డాయి. ఆ ఫుటేజ్‌లో టీచర్ చిన్నారిని కొడుతున్న తీరు చూసి గుండె తరుక్కుపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు టీచర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లలపై టీచర్లు ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

