కలం, జోగులాంబ గద్వాల: తనకు తండ్రిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు తన తల్లితో కలిసి గద్వాల (Gadwal) పట్టణంలోని ఓ ప్రధాన అర్చకుడి ఇంటి ముందు శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం, గద్వాల పట్టణానికి చెందిన ఒక మహిళ సుమారు 24 సంవత్సరాల క్రితం సదరు ప్రధాన అర్చకుడి ఇంట్లో పని చేసేదని తెలిపారు.
ఆ సమయంలో తనపై అకృత్యానికి పాల్పడి మోసం చేశారని, ఆ క్రమంలో తాను గర్భవతి అయ్యానని ఆరోపించారు. ప్రాణభయం, సమాజం పట్ల భయంతో ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా తన కుమారుడిని ఎంతో కష్టపడి డిగ్రీ వరకు చదివించినట్లు మహిళ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె కుమారుడు మాట్లాడుతూ, స్థానికంగా జరిగిన ఓ వివాదంలో తండ్రి పేరు విషయంలో ఎదురైన మాటలతో తనకు అసలు విషయం తెలిసిందన్నారు. తన తండ్రిగా ఆరోపిస్తున్న వ్యక్తిని న్యాయం చేయాలని అడిగితే చంపుతానని, చేతబడి చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో తనను కొడుకుగా అంగీకరించి, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని, అయితే గత 25–30 రోజులుగా ఫోన్ కాల్స్ ఎత్తకుండా, నంబర్లు బ్లాక్ చేస్తూ తప్పించుకుంటున్నారన్నారు.
తనకు నిజం తెలియాలని, తండ్రి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని యువకుడు డిమాండ్ చేశారు.ఇన్నాళ్లు కష్టపడి పెంచిన తన తల్లికి, తనకు చట్టబద్ధమైన న్యాయం దక్కే వరకు న్యాయపోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. తమ ఇంటి ముందు నిరసన చేపట్టి న్యూసెన్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తనపై వచ్చిన ఆరోపణలను ప్రధాన అర్చకుడు ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజానిజాలు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

