కలం, ఖమ్మం బ్యూరో: “జిల్లా రైతాంగం సాగునీటి కోసం పడుతున్న కన్నీటి కష్టాలను తీర్చే బాధ్యతను నేను స్వీకరించా.. ప్రభుత్వంతో పోరాడైనా సీతారామ ప్రాజెక్టు నీళ్లను మన పొలాలకు మళ్లిస్తాం” అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు భరోసా ఇచ్చారు. శుక్రవారం సుజాతనగర్ మండల పరిధిలోని సింగభూపాలెం చెరువును సీపీఐ నాయకులు, ప్రభుత్వ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోనే సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికీ, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందకుండా గతంలోనూ అన్యాయం జరిగిందన్నారు. కొత్తగూడెంతో పాటు భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల సాగునీటి అవసరాలకు ఈ నీటిని మళ్లించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. నీటి మళ్లింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని, ఇందుకు కూడా సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు.
జూలూరుపాడు మండలం వినోభానగర్ మీదుగా మండలంలోని చెరువులన్నింటినీ నింపుతూ, అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు గోదావరి జలాలు చేరేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కూనంనేని తెలిపారు. వీటికి త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు సాధిస్తామన్నారు. అలాగే, ఇటీవల కుంగుబాటుకు గురైన సింగభూపాలెం చెరువుకట్ట పునర్నిర్మాణానికి, రక్షణ చర్యల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేశ్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

