నేపాల్‌ విపత్తు.. తెలంగాణ బాధితుల కోసం జైశంకర్‌కు లేఖ

కలం, హనుమకొండ: నేపాల్‌లో సంభవించిన విపత్తుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రజల కోసం వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య (MP Kadiyam Kavya ) చొరవ తీసుకున్నారు. విపత్తులో పలువురు తెలంగాణవాసులు గాయపడటం, కొందరు మృతి చెందడం, మరికొందరు గల్లంతైన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని గాయపడిన తెలంగాణవాసులకు అత్యవసర వైద్యం, చికిత్స, మందులు, ఆసుపత్రి సదుపాయాలు కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. విపత్తులో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించి, అధికారిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం

ఆచూకీ తెలియని తెలంగాణవాసుల కోసం నేపాల్‌ అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని కడియం కావ్య కోరారు. బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, వారి ఆందోళనను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాయబార కార్యాలయ అధికారులతో నేరుగా చర్చ

కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ పంపిన అనంతరం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో ఎంపీ కావ్య ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ బాధితుల పరిస్థితి, గాయపడిన వారికి అందుతున్న వైద్యం, గల్లంతైన వారి ఆచూకీ, మృతదేహాల గుర్తింపు, స్వదేశానికి తరలింపు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

బాధితులు, వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు అవసరమైన సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు. తెలంగాణకు చెందిన ప్రతి బాధితుడికి అవసరమైన సహాయం అందే వరకు కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం, నేపాల్‌ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>