కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ కాంగ్రెస్ (Warangal Congress)లోని అంతర్గత విభేదాలు ముదురుతుండగా, మరోవైపు బీఆర్‌ఎస్ (BRS) రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)వరంగల్ పర్యటనకు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనలకు గులాబీ నేతలు మద్దతు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై వేటు వేస్తే, ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే పరిస్థితి వస్తుందా..? అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్‌ఎస్ ఇప్పటి నుంచే రాజకీయంగా కసరత్తు చేస్తుందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లోని అసంతృప్తి వర్గాలను తమ వైపు తిప్పుకోవడం కూడా గులాబీ పార్టీ వ్యూహంగా రాజకీయ పరిశీలకుల అంచనాగా ఉంది.
మున్సిపల్ ఎన్నికలకు పావులు
త్వరలో జరగబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలను కూడా బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా నిలవడంతో పాటు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లోని వర్గపోరు, నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంపై ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని బీఆర్‌ఎస్ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమం ఎక్కడ జరిగినా కానీ.. గులాబీ నేతలు అక్కడికి చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి హరీశ్‌రావు హాజరై అరెస్టు కావడం కూడా వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వివిధ వర్గాల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో మళ్లీ పార్టీ బలం పెంచుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం.
తూర్పుపైనే అందరి దృష్టి
ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం. మరోవైపు బీఆర్‌ఎస్ రాజకీయంగా దూకుడు. దీంతో వరంగల్ తూర్పులో ఆసక్తికరంగా మారింది. మంత్రి సురేఖపై అధిష్టానం తీసుకునే నిర్ణయం, ఆమె భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటు వేస్తుందనే అంశాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే, స్థానిక ఎన్నికగా కాకుం డా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ పరీక్షగా మలచాలని బీఆర్‌ఎస్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితం సాధించి వరంగల్‌లో రాజకీయ పునర్వైభవానికి బాటలు వేయాలని గులాబీ పార్టీ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి.

