కలం, వెబ్ డెస్క్ : ప్రకృతి విలయం ఎంత భయానకంగా ఉంటుందో నేపాల్ ఆకస్మిక వరదలు చూస్తే అర్థమవుతుంది. ఆ దేశంలో జరిగిన విపత్తుకు సంబంధించిన దృశ్యాలు చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ఈ క్రమంలో నేపాల్ కు మరో ముప్పు (Nepal Flood Threat) పొంచి ఉందని చైనా హెచ్చరించింది. ఆ దేశ సరిహద్దుల్లోని బారియర్ సరస్సు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. బారియర్ సరస్సు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వానికి చైనా హెచ్చరికలు జారీ చేసింది.
బారియర్ సరస్సు రాబోయే 72 గంటల్లో ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని చైనా జలవనరుల శాఖ పేర్కొంది. చోచెన్ ఖోలా, పురేపు త్సాంగ్పో నదుల సంగమ ప్రాంతంలో ఈ బారియర్ సరస్సు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయానికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్లు, ఇప్పటికే నీరు పొంగిపొర్లుతోందని చైనా వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు సరస్సులోకి చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
దీంతో కట్ట తెగితే దిగువ ప్రాంతాల్లో మరోసారి భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. సరస్సు పరిస్థితిపై చైనా అధకారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కట్ట తెగితే ఎదురయ్యే పరిస్థితులపై తీసుకోవాల్సిన చర్యలపై అంచనాలు సిద్ధం చేస్తున్నారు. నేపాల్‌లో ఇప్పటికే సంభవించిన ఘోర వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో చైనా హెచ్చరిక నేపాల్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

