కలం, ఖమ్మం బ్యూరో: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. గురువారం ముదిగొండ (Mudigonda) పోలీస్ స్టేషన్లో సీపీ తనిఖీలు నిర్వహించారు. రికార్డులను, పెండింగ్ కేసుల ఫైళ్లను, వివిధ కేసులకు సంబంధించిన దర్యాప్తు పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఎలాంటి అలసత్వం వహించకూడదని తేల్చి చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో వేగం పెంచి నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక సెక్టార్ అధికారులు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ మురళీ, సిబ్బంది పాల్గొన్నారు.

