కలం, జోగులాంబ గద్వాల: రైస్ మిల్లర్లకు సీఎంఆర్ అక్షయపాత్రగా మారింది . రైస్ మిల్లర్లు ఆడింది ఆట.. పాడింది పాటగా కోట్ల రూపాయల ధాన్యాన్ని దారిమల్లిస్తున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించడం, రైస్‌మిల్లర్లు వాటిని మర ఆడించి బియ్యం ప్రభుత్వానికి అందజేస్తారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం అవినీతికి అలవాటు పడిన రైస్ మిల్లర్స్ యజమానులు తమకిచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడం (CMR Rice Scam) జోగులాంబ గద్వాల జిల్లాలో నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రైస్ మిల్లర్ల అక్రమ దందాకు సివిల్ సప్లయ్ అధికారులు, రాజకీయ నాయకులు అండదండలు ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో రైస్ మిల్లర్ల అవినీతి దందాకు అడ్డే లేకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా సంవత్సరాల నుంచి చాలా రైస్ మిల్లులు మొండి బకాయిలు పేరుకుపోయాయి. అయినా సంబంధిత అధికారులు ఎవరూ అటువైపుగా దృష్టి సారించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ప్రభుత్వానికి అప్పజెప్పకుండా, మింగిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా రైస్‌మిల్లర్లు దొంగాట ఆడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొని.. రైస్‌మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చేందుకు కేవలం జాబ్‌వర్క్ (అద్దెపని) మాత్రమే చేయాలి. ఇందుకుగాను ప్రభుత్వం మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. వడ్లు గానీ, బియ్యం గానీ అమ్ముకునే అధికారం రైస్‌మిల్లర్లకు లేదు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువులో ధాన్యాన్ని మర ఆడించి బియ్యం అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం పక్కదారి పడుతోంది.
రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అధికారుల సహాయ సహకారాలతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించి మిల్లర్లు కోట్లకు పడగెత్తారు. రైస్ మిలుల్లకు కేటాయించిన ధాన్యం ఏఏ రైస్ మిల్లులో ఎంత నిల్వ ఉందో జిల్లా పౌరసరఫరాల అధికారులు ఏనాడు తనిఖీలు చేసిన పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని గద్వాల, ఇటిక్యాల, ఉండవెల్లి, అయిజ మండలాలలోని రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు బ్లాక్ మార్కెట్ కు తరలించినట్లు, అధికారులు గుర్తించిన మొదట్లోనే కట్టడి చేయకపోవడం వల్లే పెద్ద ఎత్తున దందా కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రైస్ మిల్లర్లకు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోందనే విమర్శలు ఉన్నాయి. రైస్ మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పజెప్పే బియ్యానికి బదులు రేషన్ డీలర్లు, అక్రమార్కుల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఎఫ్‌సీఐ కి కేటాయిస్తున్నట్లు ఇటీవల రేషన్ బియ్యం అక్రమార్కులు బహిరంగానే చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
నందిన్నెలోని శ్రీకమ్మిడి స్వామి రైస్ మిల్లుపై కేసు నమోదు
సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కేటిదొడ్డి మండలం నందిన్నెలోని శ్రీకమ్మిడిస్వామి రైస్ మిల్లుపై ఇటీవల కేసు నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని రైస్ మిల్లులలో ధాన్యం పక్కదారి పట్టిందని హైకోర్టు ఉత్తర్వులు మేరకు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కమిషనర్ అదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ (ఎన్ఫోర్స్మెంట్), రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి కమ్మిడిస్వామి రైస్ మిల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈనెల 17న జిల్లా కలెక్టర్ కు సమర్పించిన నివేదిక ప్రకారం భారీగా ధాన్యం కొరత ఉన్నట్లు రూ.40.70 కోట్లకు పైగా వరి ధాన్యం దారి మళ్ళినట్టు గుర్తించారు. ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడంతో కేటిదొడ్డి పోలీస్ స్టేషన్ లో సంబంధిత మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు.
మూడేళ్లుగా కొనసాగుతున్న అక్రమ దందా..!
2022-23 రబి సీజన్లో ప్రభుత్వం 1,425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత మిల్లుకు కేటాయించింది. దీనికి బదులుగా 355.749 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మిగతా 1,069.771 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి బకాయి ఉన్నట్లు తేలింది. కాగా 2022-23 రబి సీజన్ కు సంబంధించి 552.640 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల నుంచి పక్కదారి పట్టినట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు.
అలాగే 2024-25 ఖరీఫ్ సీజన్‌కు 5,948.560 మెట్రిక్ టన్నులు కేటాయించగా 1,079.664 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించడంతో 4,868.896 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. మిల్లు నుంచి 4,315.240 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది. అలాగే 2024-25 రబి సీజన్ కు సంబంధించి 10,380.160 మెట్రిక్ టన్నులు మిల్లుకు కేటాయించగా 1,253.903 మెట్రిక్ టన్నులు మాత్రమే సీఎంఆర్ రైస్ అందించగా 9,126.257 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. మిల్లు నుంచి 7,775.160 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది.
సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ విమల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్లు ప్రాంగణంలో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం నిల్వలు కూడా కనిపించలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించి చర్యలకు ఉపక్రమించారు.
ఒప్పంద నిబంధనల 2022-23, 2024-25, 2024-25 సీజన్ కు సంబంధించి 12,643.40 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉండగా.. రూ.40,70,82,947 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈ వ్యవహారంపై శ్రీ కమ్మిడిస్వామి రైస్ మిల్ యజమాని కుర్వ వీరన్నపై కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పాతపాలెంలోని ప్రభుత్వం ధాన్యం నిల్వ గోధాంలో గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య, కేటిదొడ్డి ఎస్ఐ పి.శ్రీనివాసులు, సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు.
సివిల్ సప్లయ్ అధికారుల పాత్రపై అనుమానం..!
2023, 2024, 2025 ధాన్యం కేటాయింపులపై పోలీసులు ఆ శాఖలోని కీలక ఉద్యోగుల పాత్రపై జిల్లా పోలీస్ అధికారులు విచారించినట్లు సమాచారం. సివిల్ సప్లయ్ అధికారులు తీసుకున్న చర్యలు, తనిఖీలు, నివేదికలపై ఆరా తీశారు. ఎన్ఫోర్స్మెంట్, విజెలెన్స్ అధికారుల నిఘా ఉన్నప్పటికీ మిల్లు నిర్వాహకుడు ప్రభుత్వాన్ని మోసం చేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమవడంతో సివిల్ సప్లయ్ అధికారుల పాత్రనే కీలకంగా మారనున్నది.
బయటపడుతున్న మరికొన్ని మిల్లుల వ్యవహారం
జిల్లాలో 40 రైస్ మిల్లులకు ప్రభుత్వం రైతుల నుంచి వడ్లను సేకరించి ఇస్తే వాటిని మిల్లర్లు మరాడించి రైస్ ఇవ్వాలి. అయితే గద్వాల, ఇటిక్యాల, ఉండవెల్లి, అయిజ మండలాలో పలు రైస్ మిల్లులో భారీ సంఖ్యలో మిల్లర్లు వడ్లను, బియ్యాన్ని అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. నేటికి ఆ మిల్లులో పలు సీజన్ కు సంబంధించి ధాన్యం నిల్వలు ఉండకపోవడం, ఇదంతా జిల్లా సివిల్ సప్లయ్ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ అక్రమాల్ని ఎప్పటికప్పుడు గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి, మిల్లర్లతో మిలాఖత్ అవడం ప్రభుత్వానికి నష్టం తెచ్చిపెడుతోంది. శ్రీ కమ్మిడిస్వామి రైస్ మిల్ ఘటన తరువాత మిగత రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

