కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్, రామస్వామి తండా గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నిర్వహించిన గ్రామ సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఆయన పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా తమ ఓటు హక్కుకు సంబంధించిన వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా అధికారులు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

