మెట్‌పల్లిలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. రూ.6. 38 లక్షల సరుకు సీజ్!

కలం, కరీంనగర్ బ్యూరో: దాద్రా నగర్ హవేలీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం (Liquor Smuggling) డంప్‌ను మెట్‌పల్లి ఎక్సైజ్ పోలీసులు (Metpally Excise Police) పట్టుకున్నారు. రూ.6.38 లక్షల విలువైన 70 బాక్సుల ఇంపీరియల్ బ్లూ (ఐబీ) మద్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మద్యం రవాణాకు ఉపయోగించిన వ్యాన్‌తో పాటు నాలుగు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల 14న కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో 13 బాక్సుల అక్రమ మద్యం పట్టుబడిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని భివాండీకి చెందిన ప్రధాన నిందితుడు ప్రవీణ్ సిరిగిరి దాద్రా నగర్ హవేలీలో రూ.2.85 లక్షలకు 70 బాక్సుల మద్యాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

మద్యాన్ని గంభీర్‌పూర్‌కు తరలించేందుకు డ్రైవర్ ప్రదీప్ జైస్వాల్, అతడి స్నేహితుడు అజయ్ భగవాన్‌తో రూ.65 వేల ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులకు అనుమానం రాకుండా వ్యాన్‌లో ప్రత్యేక ర్యాక్‌లు, రహస్య అరలు ఏర్పాటు చేసి మద్యాన్ని దాచిపెట్టి రవాణా చేసినట్లు వెల్లడించారు.

గత వారం రోజులుగా నిందితుల కదలికలపై నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు గురువారం తెల్లవారుజామున 1 గంట నుంచి రూట్‌వాచ్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్‌ను గుర్తించి తనిఖీ చేయగా రహస్య అరల్లో దాచిన 70 బాక్సుల ఐబీ మద్యం బయటపడింది. తెలంగాణ మార్కెట్‌లో వీటి విలువ రూ. 6,38,400 ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మెట్‌పల్లి ఎక్సైజ్ సీఐ రాథోడ్‌తో పాటు సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని ప్రభుత్వ పురస్కారాలకు సిఫార్సు చేస్తామని తెలిపారు. అక్రమ మద్యం లేదా మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు 1800 425 2523 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని ఎక్సైజ్ అధికారులు కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>