కలం, ఖమ్మం బ్యూరో: ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ఎస్సీ, గిరిజన గ్రామాల మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ నీటిపారుదల వసతులు పెంచేందుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం అత్యంత ఆవశ్యకమని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని పూర్తి చేయడానికి, అలాగే ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, తండాల్లో అంతర్గత రహదారులు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.
మరోవైపు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, పినపాక, అల్లపల్లి, గుండాల మండలాల్లో మారుమూల గ్రామాలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రతిపాదించిన బీటీ రోడ్లు, హై లెవల్ వంతెనల నిర్మాణాలకు త్వరగా పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మెరుగైన రహదారులు, వంతెనలు అందుబాటులోకి వస్తే రైతులు పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి, విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లేందుకు, అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు చేర్చడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రికి వివరించారు.
ఎమ్మెల్యేల విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. గిరిజన, ఎస్సీ ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. చెక్‌డ్యామ్‌లు, కమ్యూనిటీ భవనాలు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుతో పాటు తగిన పరిపాలనా అనుమతులు లభించేలా వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, ప్రగతి ధ్యేయంగా తాము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

