డీప్‌సైడ్ బ్లాక్‌తో మారనున్న మణుగూరు రూపురేఖలు: ఎమ్మెల్యే

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి ఓసీ-2 డీప్‌సైడ్ బ్లాక్ కేటాయింపుతో ప్రాంతీయ రూపురేఖలు మారడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విశేషంగా పెరుగుతాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateswarlu) ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణి సంస్థ పరిధిలోకి తీసుకురావడంలో ప్రత్యేక చొరవ చూపిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిని శాలువాతో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పవిత్ర ప్రసాదాన్ని అందజేశారు.​

మణుగూరు ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ డీప్‌సైడ్ బ్లాక్ సింగరేణి యాజమాన్యం పరిధిలోకి రావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల స్థానికంగా కొత్త ఉపాధి మార్గాలు సుగమం కావడమే కాకుండా, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మణుగూరు, పినపాక నియోజకవర్గాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక, ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిర్ణయం మరింత ఊతమిస్తుందని వివరించారు. ​సింగరేణి సంస్థ అభివృద్ధికి దోహదపడుతూనే, స్థానిక యువతకు విస్తృత ఉద్యోగావకాశాలు కల్పించడం మణుగూరు ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పినపాక నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థల సహకారంతో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>