కలం, నిర్మల్: మహిళా సమానత్వ దినోత్సవాన్ని(Womens Equality Day) పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య సిబ్బందిని బుధవారం ఘనంగా సన్మానించారు. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న కత్తి భూమవ్వ, దర్శనం లక్ష్మి, బర్కుంట పోసవ్వలను లయన్స్ జోన్ చైర్మన్ కె. చంద్రమోహన్ రెడ్డి, క్లబ్ సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్ శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో సమాన హక్కులు, అవకాశాలు కల్పించినప్పుడే సమాజం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతను ప్రోత్సహించడమే మహిళా సమానత్వ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో మహిళా పారిశుధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తించి సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

