కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు ప్రజల ఖాతాలు ఖాళీ చేసేందుకు కొత్త తరహా మోసం ఎంచుకున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని సెల్‌ఫోన్లు చోరీ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న కొత్త తరహా మోసం ‘హైబ్రిడ్ ఫ్రాడ్’ (Hybrid Cyber Fraud) వెలుగులోకి వచ్చింది. ఫోన్ అన్‌లాక్ చేసే ప్యాటర్న్, పిన్, పాస్‌వర్డ్‌ను గమనించి చోరీ చేసి అనంతరం UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా బాధితుల ఖాతాల్లోని నగదును సైబర్ ముఠా కాజేస్తున్నారు.
బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్ లేదా ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను దొంగతనం చేస్తారు. లాక్ తీయడానికి ప్రయత్నించి విఫలం అయితే.. బాధితులు కాల్ చేసినప్పుడు ‘మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం’ అంటూ లేదా ‘ఓనర్ వెరిఫికేషన్’ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్‌వర్డ్‌లు రాబడుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్, పాన్ వివరాలను సేకరించి ఆ ఫోన్ వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు రీసెట్ చేసి, డబ్బును ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు.
ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ (Hybrid Cyber Fraud) ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని తెలిపారు.
అలాగే, ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో, నోట్స్‌లో ఎప్పుడూ భద్రపరచుకోవద్దని సూచించారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయాలని.. సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని కోరారు.

