కలం, వెబ్ డెస్క్: ఆర్థికంగా తెలంగాణ పరిస్థితి బాగాలేకపోయినా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు.పేదల సొంతింటి సహకారం చేయడంతో కేంద్రం సహకరించకపోయినా తమ ప్రజా ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని..నిధులు విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం రిలీజ్ చేయలేదని తెలిపారు.
ప్రధాని మోదీని, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుమార్లు కలిసి తెలంగాణకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లలో గురువారం నిధులు జమ అవుతాయని పేర్కొన్నారు. మిగిలిన లబ్దిదారులకు సైతం విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఫైనల్ బిల్ రాని లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

