కలం, నిర్మల్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ (TGEJAC) జిల్లా చైర్మన్ ప్రభాకర్, జిల్లా గౌరవ చైర్మన్ ఎంసీ లింగన్న కోరారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మహా ధర్నాకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే రెండో పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2004 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మహా ధర్నా ఉంటుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జాదవ్ వెంకట్రావ్, లక్ష్మణ్, పెంట అశోక్, భూమన్న యాదవ్, దర్శనం దేవేందర్, భూమన్న, మహేంద్ర చారి, వహీద్ ఖాన్, రవికుమార్, అశోక్, జాదవ్ గణేష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

