సాగునీటి కోసం కాలువలకు ప్రత్యేక ఓటీలు : బీర్ల అయిలయ్య

కలం, యాదాద్రి భువనగిరి : రైతుల పొలాలకు సాగునీరు అందించడంతో పాటు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం సంగ్య తండా పరిధిలో మల్లన్నసాగర్ 15, 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రధాన కాలువను మంగళవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కాలువకు దిగువన ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సాగునీటి రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆలేరు నియోజకవర్గంలో కాలువలకు ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసి ఇప్పటికే పలు చెరువులను నింపామన్నారు.

బస్వాపూర్ వైపు వెళ్లే కాలువలో మరో రెండు ఓటీలను ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు 70 నుంచి 80 చెరువులను నింపే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి, రైతులకు సాగునీటి కొరత తీరుతుందన్నారు. బస్వాపూర్, గంధమల్ల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. అందుకోసమే బస్వాపూర్, గంధమల్ల భూ బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేసిన తర్వాతే ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ, డీఈ, ఇతర సాంకేతిక సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>