కలం, మెదక్ బ్యూరో : తెలంగాణలో ఉద్యాన విశ్వ విద్యాలయం ఉన్నప్పటికీ ఉద్యాన సీట్లను అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందని ములుగు (Mulugu) కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుని ఉద్యాన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందు విద్యార్థుల ధర్నా నిర్వహించారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీలో హార్టీకల్చర్ సీట్లను భర్తీ చేయడం బాధాకరమని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యాన వర్సిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సీట్ల అనుమతులవ్వడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రారంభమైన 20ఏళ్లు గడిచిపోతున్న ఎలాంటి రిక్రూట్మెంట్ లేదని విద్యార్థులన్నారు.
ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వరకు ప్రతి పక్షంలో ఉన్నపుడు ఉద్యాన విద్యార్థుల సమస్యలను తీరుస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యాన సీట్లను భర్తీ చేయడానికి ఎలా అనుమతిస్తారని విధ్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సీట్ల భర్తి ప్రతి పాదనను ఉపసంహరించుకోవాలని కోరారు.

