కలం, స్పోర్ట్స్ : ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్ రేసు నుంచి వైదొలగడంపై మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ (PR Sreejesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్‌ను ప్రాక్టీస్ మ్యాచ్‌లా పరిగణించకూడదని, జట్టు వైఫల్యానికి యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టోర్నీకి ముందు ప్రో లీగ్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత పురుషుల జట్టు, ఆ తర్వాత తమ సన్నాహాలపై ధీమా వ్యక్తం చేసింది. అయితే సోమవారం ఆమ్‌స్టెలెవీన్‌లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 3-5 తేడాతో ఓడిపోయి సెమీస్ ఆశలను వదులుకుంది.
అంతకుముందు శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను 0-0తో ముగించిన మహిళల జట్టు కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ వరుస పరాజయాలపై శ్రీజేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. కేవలం మ్యాచులు ఆడటానికి జట్టును తయారు చేస్తున్నామా లేక ప్రపంచ అత్యుత్తమ జట్లను ఓడించేందుకు సిద్ధం చేస్తున్నామా అని ప్రశ్నించారు. ఓటమి ఎదురైనప్పుడల్లా “నేర్చుకునే ప్రక్రియ” అని లేదా ఆసియా జట్లపై గెలవగానే “గొప్ప విజయం” అని చెప్పుకోవడం ఆపాలని కోరారు.
ముఖ్యమైన సన్నాహకాల సమయంలో మహిళల జట్టు చీఫ్ కోచ్ అందుబాటులో లేకపోవడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అడ్డంకులు ఉన్నప్పటికీ క్రీడాకారిణులు అద్భుతంగా పోరాడారని మెచ్చుకుంటూనే, జవాబుదారీతనం ఎక్కడుందని నిలదీశారు. అలాగే వచ్చే నెలలో జరిగే ఆసియా గేమ్స్‌ను బూచీగా చూపిస్తూ వరల్డ్ కప్ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ పతకాల విజేత అయిన శ్రీజేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాకీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

